హైదరాబాద్‌లో భారీ వర్షాల హెచ్చరిక

హైదరాబాద్‌లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉండటంతో పాటు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా సాయంత్రం వర్షం కురిస్తే అమీర్‌పేట్, బేగంపేట్, రసూల్‌పురా, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, శిల్పారామం, నెక్టార్ గార్డెన్, మాదాపూర్ సీవోడీ, ఐకియా, బయోడైవర్సిటీ, కేపీహెచ్‌బీ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవచ్చని సూచించింది. వాహనదారులు ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

గురువారం కురిసిన భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో వరద నీరు సెల్లార్లలోకి చేరింది. పుప్పాలగూడలో 35 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. 2008లో శివాలయ రక్షణ కోసం నిర్మించిన ఈ గోడ వర్షాల ధాటికి కూలి, మూడు ఇళ్లు కొట్టుకుపోయాయి. అదృష్టవశాత్తు, ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో 9, 10 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, 13న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.