యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్ట్‌లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రామంతాపూర్‌కు చెందిన బంధబాల సుధాకర్ (39), గాంధీనగర్‌కు చెందిన పాసాల సుష్మిత (35)గా గుర్తించారు. వీరిద్దరూ బావమరదలుగా ఉండే వారు. ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లయినప్పటికీ, వారి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ విషయం కుటుంబాల్లో గొడవలకు దారి తీసింది. సుష్మిత భర్త ఆమెపై కేతేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడంతో, ఆమె తీవ్ర మనస్తాపానికి గురై సుధాకర్ వద్దకు వెళ్లింది. అనంతరం ఇద్దరూ కలిసి బీబీనగర్ రిసార్ట్‌లో గది అద్దెకు తీసుకుని రెండు రోజులుగా అక్కడే ఉండేవారు. నిన్న మధ్యాహ్నం సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుధాకర్ తన బావ రంజిత్‌కు వీడియో కాల్ చేసి విషయం తెలియజేసినప్పటికీ, గది స్థానం చెప్పలేదు. దీంతో రంజిత్ ఉప్పల్ పోలీసుల సహాయంతో బీబీనగర్ స్టేషన్లో సమాచారం ఇచ్చాడు. పోలీసులు మొబైల్ నెట్వర్క్ ఆధారంగా వారి గదిని గుర్తించి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, ఇద్దరూ మృతిచెందినట్టు తేలింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Read More : మీడియా వ్యవహారశైలి పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
