హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా మారనుంది: సీఎం.

హైదరాబాద్ నగరం భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్‌గా రూపాంతరం చెందనుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యుత్ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. నగరంలో అత్యాధునిక ‘డేటా సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్రంలోని ప్రస్తుత విద్యుత్ డిమాండ్, భవిష్యత్తు అవసరాలపై ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో గరిష్టంగా 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 9.8 శాతం అధికమని అధికారులు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని, 2025-26 నాటికి 18,138 మెగావాట్లకు, 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.

రాష్ట్రంలో నిర్మించనున్న నీటిపారుదల ప్రాజెక్టులు, రైల్వే, మెట్రో, ఇతర ప్రజా రవాణా వ్యవస్థల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్, ఇతర నగరపాలక సంస్థల విద్యుత్ అవసరాలతో పాటు, కొత్తగా ఏర్పాటు కానున్న డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు అవసరమైన విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించనున్న రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్‌షిప్‌లకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం హెచ్‌ఎమ్‌డీఏతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్లను ఆధునీకరించాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు నగరాల్లో భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ టవర్లు, స్తంభాలు, లైన్లు బహిరంగంగా కనిపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని, సచివాలయం, నెక్లెస్ రోడ్డు, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డులో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఫుట్‌పాత్‌లు, నాలాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

Read More : కేటీఆర్‌తో కీలక రాజకీయ సమావేశం

One thought on “హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా మారనుంది: సీఎం.

Comments are closed.