హెచ్‌సీయూ భూముల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తోందని, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ భవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రాత్రి సమయంలో బుల్డోజర్లతో హెచ్‌సీయూ ప్రాంగణంలోకి ఎందుకు వెళ్లారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భూముల వివాదంపై మంత్రులు విద్యార్థులను చులకనగా మాట్లాడడం దారుణమని విమర్శించారు. ఫ్యూచర్ సిటీకి 14 వేల ఎకరాలు ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లోని భూములను ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.
భూములు కొంటే తిరిగి స్వాధీనం చేసుకుంటాం – కేటీఆర్
రాష్ట్రంలో మూడేళ్లలో తాము తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్, కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై తమ ప్రభుత్వం స్పష్టమైన కమిట్మెంట్ ఉందన్నారు. అధికారంలోకి రాగానే అక్కడ అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానం రియల్ ఎస్టేట్ ప్రాతిపదికన ఉందని ఆరోపించారు.
దొడ్డి కొమురయ్య స్ఫూర్తిగా పోరాటం
దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఘన నివాళులు అర్పించిన కేటీఆర్, తెలంగాణ సాయుధ పోరాటానికి కొమురయ్య స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం పోరాడిన ఆయన త్యాగం తెలంగాణ సమాజానికి మార్గదర్శకమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Read More : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి: రిజర్వేషన్ల అమలుకు జనాభా లెక్కలు అవసరం…
