హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో తీవ్ర కలకలం రేగింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉచిత ఐపీఎల్ టికెట్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీని బెదిరించినట్లు ఆరోపణలు వెలువడగా, నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ కేసులతో పాటు మరో నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించారు. ప్రస్తుత హెచ్‌సీఏ కమిటీని తక్షణమే రద్దు చేసి, నూతనంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన అజార్, “ఒక అధ్యక్షుడి అరెస్ట్ సంస్థ పరిపాలనపైనే మచ్చ వేసే ఘటన. ఐపీఎల్ టికెట్ల విషయంలో అదనపు టికెట్ల కోసం ఒత్తిడి చేయడం, ఒప్పుకోకపోతే బెదిరించడం దారుణం” అన్నారు. సభ్యులు గ్రూపు రాజకీయాలను పక్కనబెట్టి క్రీడాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అవసరం అయితే తాను మళ్లీ హెచ్‌సీఏ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇక జగన్మోహన్ రావు ఎన్నికల్లో నకిలీ పత్రాలు సమర్పించారని సీఐడీ విచారణలో తేలింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి అధ్యక్ష పదవికి పోటీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గౌలీపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత ఫోర్జరీ పత్రాలను అందించగా, వాటిని ఉపయోగించి జగన్మోహన్ పదవిలోకి వచ్చారని పోలీసులు వెల్లడించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో హెచ్‌సీఏ పరిపాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ పాలనలో పారదర్శకత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని క్రీడాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
Read More : నకిలీ పత్రాలతో పదవి దక్కించుకున్న ఆరోపణలు

One thought on “అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్, అజారుద్దీన్ ఘాటుగా స్పందన”
Comments are closed.