దాదాపు 5 ఏళ్ళ తర్వాత ఎట్టకేలకు హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉండేది. ఏఎం రత్నం నిర్మాతగా, తన కుమారుడు జ్యోతి కృష్ణ & క్రిష్ దర్శకులుగా ఈ సినిమాని తెరకెక్కించారు. క్రిష్ మధ్యలో తప్పుకోగా, జ్యోతి కృష్ణ సినిమాని పూర్తి చేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ సినిమా మరి ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే.. హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్) ఓ మంచి దొంగ. “పెద్దవాళ్లను కొట్టు, పేదవాళ్లకు
పెట్టు” అనే ఉద్దేశంతో పెత్తందారులు, భూస్వాములు, రాజుల వద్ద దొంగతనం చేసి వాటిని పేదలకు పంచి పెడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి విదేశాలకు తరలి వెళ్తున్న సంపదను బందరు పోర్టులో దొంగలిస్తాడు. ఈ విషయం తెలిసిన కొల్లూరు సంస్థానీసుడు వీరమల్లును పిలిపించి, తాను తానీషాకి కప్పం కట్టే సంపదను దొంగిలించాల్సిందిగా కోరుతాడు. ఆ సమయంలోనే అంతఃపురంలో ఉన్న పంచమి (నిధి అగర్వాల్)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. తర్వాత తానీషా దగ్గరకు వెళ్తున్న సంపదను దొంగిలిస్తూ పట్టుబడగా, అక్కన్న, మాదన్నలు, ఔరంగజేబ్ (బాబీ డియోల్) వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకొస్తే ఒక వజ్రాల గని ఇస్తామని చెప్పడంతో వీరమల్లు అందుకు సిద్ధమై ఢిల్లీ బయలుదేరుతాడు. అయితే, వీరమల్లు ప్రయాణం ఎలా సాగింది? ఎవరెవరు వీరమల్లు వెంట వెళ్లారు? హిందువులను కనీసం మనుషులుగా కూడా చూడని ఔరంగజేబ్ ఇలాకాలో వీరమల్లు ఏం చేశాడు? చివరికి కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకొచ్చాడా లేదా? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
ఎలా ఉంది, ఎలా తీశారో చూస్తే… నిజానికి సినిమా ఓపెనింగ్లో పవన్ కల్యాణ్ తల్లిదండ్రుల నుంచి వరద కారణంగా దూరమై సత్యరాజ్ కుటుంబానికి దొరుకుతాడు. బ్రాహ్మణోత్తముడైన సత్యరాజ్ ఆ బుడతడు అందరికీ ఉపయోగపడేవాడు అవుతాడని, కష్టాలు తీర్చేవాడు అవుతాడని చెప్పి చిన్నప్పటి నుంచే అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. ఇక అక్కడ కట్ చేస్తే, బందరు పోర్టులో దొంగతనంతో పవన్ ఎంట్రీ అదిరిపోయేలా రాసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా కృష్ణా నది తీరం నుంచి ఢిల్లీ గద్దె మీదకు వెళ్లిన కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చేందుకు, అదే కృష్ణా నది తీరం నుంచి హరిహర వీరమల్లు చేసే ప్రయాణమే మొదటి భాగం సినిమా. అందులో భాగంగా ఒకపక్క పవన్ కల్యాణ్ పాత్ర ఎస్టాబ్లిష్మెంట్ చూపిస్తూనే, మరోపక్క ఆ రోజుల్లో హిందువుల మీద మొగల్ రాజుల దురాగతాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఒకపక్క పవన్ అభిమానులను, మరోపక్క ఆయనను అభిమానించే హిందుత్వవాదులను సంతృప్తి పరిచేలా చాలా సీన్స్ రాసుకున్నారు. అలాగే డైలాగ్స్ కూడా జనసైనికులను ఆనందింపజేసేలా రాశారు. అయితే, కొన్నిచోట్ల సీన్స్ పవన్ అభిమానులు పండగ చేసుకునేలా ఉంటే, పేలవమైన విఎఫ్ఎక్స్ మాత్రం ఇబ్బంది పెడుతుంది. నిజానికి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథ మొదలైనా కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఇది కథగా రాసుకున్నప్పుడు ఒక అద్భుతమైన కథ, కానీ దాన్ని తెర మీదకు తీసుకొచ్చే విషయంలో మాత్రం దర్శకుడిలో అనుభవ లేమి కనిపిస్తుంది. ఈ సినిమాని పూర్తిగా క్రిష్ దర్శకత్వంలోనే పూర్తి చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో అనిపిస్తుంది. అయితే, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కాలర్ ఎగరేసుకునేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ విషయంలో, అలాగే ఎమోషనల్ టచ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరే లెవెల్లో ఉండేది. అయితే, చివరిలో ఎవరూ ఊహించని విధంగా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.
నటీనటుల విషయానికి వస్తే.. ఇది పూర్తిగా పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో. సినిమా ఎప్పుడో 2020లో ప్రారంభమై, మొన్నటి వరకు షూటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే పవన్ లుక్స్ లో చాలా వేరియేషన్స్ కనిపించాయి, కానీ ఆయన యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఆయన స్క్రీన్ మీద కనిపిస్తున్నంత సేపు అదో రకమైన మ్యాజిక్ అంతే. పంచమి పాత్ర కావాలని ఇరికించినట్లు ఉంది. ఆమెకు మేకప్ కూడా సెట్ కాలేదు. కొన్ని చోట్ల నిధి అగర్వాలేనా అనిపిస్తుంది. బహుశా చాలా లాంగ్ రన్లో షూట్ చేయడం వల్ల కంటిన్యూటీ దెబ్బతిని ఉండవచ్చు. ఇక ఔరంగజేబ్ అనే క్రూరుడి పాత్రలో బాబీ డియోల్ ఒదిగిపోయాడు. సత్యరాజ్, ఈశ్వరి రావు, రఘు బాబు, కబీర్ సింగ్, సునీల్, సుబ్బరాజు, సచిన్ ఖేడ్కర్ వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. కోట శ్రీనివాసరావు ఒక సీన్లో కనిపించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. ఈ సినిమాకి పవన్ కల్యాణ్ హీరో, అలాగే ఆయన వన్ మ్యాన్ షో చేస్తే, దానికి పూర్తిస్థాయిలో సహకరించింది కీరవాణి. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకి అదనపు ఆకర్షణ తీసుకురావడమే కాదు, కొన్నిచోట్ల నిలబెట్టేసిందని చెప్పచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది, అయితే ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు పనిచేసిన విషయం అర్థమయ్యేలా ఉంది. తోట తరణి ఆర్ట్ వర్క్ సినిమాకు అదనపు ఆకర్షణ. పవన్ చేసిన ఫైట్ సీక్వెన్స్ లు అన్నీ వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ సీన్ తో పాటు పోర్ట్ ఫైట్, కుస్తీ ఫైట్ సహా ఠాణా ఫైట్ ఆకట్టుకునేలా ఉన్నాయి. డైలాగ్స్ సెట్ అయ్యాయి, కొన్ని గుచ్చుకునేలా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మొత్తంగా చూస్తే 5 ఏళ్ళ నిరీక్షణ… సినిమాకి ఇంకొంచెం పదును పెట్టుంటే బాగుండేని అనిపించింది.
Read More : భూ వివాదంలో రాజీవ్ కనకాలకి నోటీసులు
