ఘన విజయంతో మెరిసిన భారత యువ ఛెస్‌ ప్లేయర్

భారత యువ చెస్‌ గౌరవం మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. గ్రాండ్ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్ కార్ల్‌సన్‌ను చిత్తుచేసిన దొమ్మరాజు గుకేశ్‌ ఘన విజయం సాధించాడు. క్రొయేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో ర్యాపిడ్ విభాగంలో గుకేశ్ అద్భుతంగా రాణించాడు. ఈ విజయం ప్రత్యేకంగా నిలవడానికి ఓ కారణం ఉంది. టోర్నీ ప్రారంభానికి ముందు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో గుకేశ్‌ను బలహీన ఆటగాడిగా అభివర్ణించిన కార్ల్‌సన్‌కు అదే గుకేశ్‌ చెస్ బోర్డుపై గట్టి గుణపాఠం చెప్పాడు. మ్యాచులో గుకేశ్‌ దూకుడుగా ఆడి, ఖచ్చితమైన ఎత్తులతో ప్రత్యర్థిని ఒత్తిడికి లోను చేశాడు. తన పరాజయం తర్వాత కార్ల్‌సన్ స్పందిస్తూ, “ఈ టోర్నీలో నేను చాలా చెత్తగా ఆడాను. గుకేశ్‌ చేతిలో గట్టి శిక్ష పడ్డాను. మొదట మంచి స్థితిలో ఉన్నాననిపించింది. కానీ గుకేశ్ తన అవకాశాలను తానే సృష్టించుకున్నాడు. సమయం తక్కువగా ఉండటంతో ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. అతను అద్భుతంగా ఆడాడు” అని అంగీకరించారు.

“ఈ విజయానికి పూర్తి క్రెడిట్ గుకేశ్‌కే. అతను ఎంతో నిశితంగా, సమర్థంగా ఆడాడు” అంటూ మాజీ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ గుకేశ్‌ను ప్రశంసించడం విశేషం. 18 ఏళ్ల వయస్సులో ప్రపంచ నంబర్‌వన్‌ను ఓడించిన గుకేశ్ అద్భుత ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఈ విజయం భారత్‌కు గర్వకారణంగా నిలిచింది.

Read More : శుభ్‌మన్ గిల్ పాత వీడియో వైరల్