గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది

గోదావరి నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గడిచిన ఐదు రోజులుగా ఎగువ ప్రాంతాలు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉపనదులు, కొండవాగులు ఉప్పొంగి ప్రధాన నదిలో కలుస్తున్నాయి. ఈ కారణంగా గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది.
దీంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా సుమారు 49 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ, జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

వరద ప్రభావం నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం నుంచి పాపికొండల వరకూ జరుగుతున్న విహార యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే దేవీపట్నం మండలం పరిధిలోని దండంగి – డి.రావిలంక గ్రామాల మధ్య ఉన్న ఆర్‌ అండ్‌ బీ రహదారిపై గోదావరి ప్రవాహం పెరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గండి పోచమ్మ ఆలయం దిశగా వెళ్లే ప్రయాణాలు కూడా నిలిచిపోయాయి.

ప్రస్తుత వర్షపాత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read More : కుప్పంలో సీఎం పర్యటన ప్రారంభం