ఓవల్ మైదానంలో భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సమయంలో జరిగిన వాగ్వాదంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు. కోచ్ గౌతమ్ గంభీర్ మరియు పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్‌ల మధ్య చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు.
“మంగళవారం మా జట్టు నెట్స్‌లో సాధన చేస్తోంది. అప్పుడే చీఫ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ వచ్చి, ‘పిచ్ నుంచి 2.5 మీటర్ల దూరంలో ఉండండి. మ్యాచ్ పిచ్ చూడాలంటే తాడుకు అవతలివైపు నుంచి చూడండి’ అని చెప్పాడు. ఇలాంటి మాటలు ఏ దేశంలోనూ వినలేదు” అని కోటక్ తెలిపారు. దీనిపై గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారని కోటక్ వెల్లడించారు. “గౌతీ అతడికి ‘మేము ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాం, నువ్వు నీ హద్దుల్లో ఉండు’ అని బదులిచ్చాడు. అయినా ఫోర్టిస్ ఆగలేదు. ‘మీపై ఫిర్యాదు చేస్తాను’ అని హెచ్చరించాడు. దానికి గౌతీ, ‘నువ్వు ఎవరికి కావాలంటే వారికి ఫిర్యాదు చేయి. మాకు ఏం చేయాలో మేమే తెలుసు’ అని గట్టిగా సమాధానమిచ్చాడు” అని కోటక్ వివరించారు.
తమ ఆటగాళ్లు నెట్స్‌లో స్పైక్స్ కాకుండా జాగింగ్ షూలే వేసుకున్నారని, అలాంటప్పుడు పిచ్ దెబ్బతినే అవకాశం లేదని కోటక్ స్పష్టం చేశారు. అంతేకాదు, అంతకుముందు ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఏకంగా పిచ్ మధ్యలో నిల్చొని క్యూరేటర్‌తో మాట్లాడిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ ఘటనపై ఐసీసీకి ఫిర్యాదు చేయబోమని కోటక్ స్పష్టంచేశారు.
Read More : సెమీస్‌లోకి ఇండియా ఛాంపియన్స్ – రేపు పాక్‌తో పోరు.

One thought on “ఓవల్‌లో గంభీర్–క్యూరేటర్ వాగ్వాదం: కోటక్ స్పందన”
Comments are closed.