బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో చేతులు కలపను: డీకే శివకుమార్ స్పష్టం

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తాను పుట్టుకతోనే కాంగ్రెస్‌వాడినని, జీవితాంతం ఆ పార్టీకే అంకితభావంతో కొనసాగుతానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం ‘నమస్తే సదా వత్సలే మాతృభూమి’ ఆలపించడంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రచారంపై శుక్రవారం విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ శివకుమార్ స్పష్టతనిచ్చారు. బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని ఆయన ఖండించారు. “నేను నిస్సహాయంగా కాంగ్రెస్ కోసం పుట్టాను, నా జీవితం, నా రక్తం అన్నీ కాంగ్రెస్‌కే అంకితం. ప్రస్తుతం పార్టీని ముందుకు నడిపిస్తున్న నేను, ఒక మూలస్తంభంలా అండగా నిలుస్తాను” అని శివకుమార్ దృఢంగా తెలిపారు.

ఆర్ఎస్ఎస్ గీతం పాడిన విషయంపై వివరణ ఇస్తూ, “నేను జనతాదళ్, బీజేపీపై ఎలా అధ్యయనం చేశానో, అలాగే ఆర్ఎస్ఎస్ గురించీ తెలుసుకున్నాను. ప్రతి పార్టీ, ప్రతి సంస్థను అర్థం చేసుకోవడం ఒక రాజకీయ నాయకుడిగా నా బాధ్యత. ఆర్ఎస్ఎస్ విద్యాసంస్థల ద్వారా తన సంస్థను ఎలా బలపరచుకుంటుందో నాకు అవగాహన ఉంది” అని వివరించారు.

అలాగే, “రాజకీయంగా మన మధ్య విభేదాలు ఉన్నా, ప్రత్యర్థులలో ఎవరు మిత్రులు, ఎవరు శత్రువో తెలుసుకోవడం అవసరం. కొన్ని సంస్థల్లో కొన్ని మంచి లక్షణాలు ఉంటే వాటిని గుర్తించడంలో తప్పు లేదు. నేను చేసినది అదే” అని అన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ నేతల ధర్మస్థల యాత్రపై స్పందిస్తూ, బీజేపీ ప్రస్తుతం బలహీన పడిన శక్తి మాత్రమేనని, వారు చేస్తున్నది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అని విమర్శించారు. అదేవిధంగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై ఆరోపణలు చేసిన కార్యకర్త మహేశ్ శెట్టి తిమరోడి అరెస్టును సమర్థించారు. “రాజకీయాల్లో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదు. ప్రత్యర్థులైనా వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. ఈ రోజు వాళ్లపై మాట్లాడితే, రేపు మనమీద కూడా అలాంటి ఆరోపణలు రావచ్చు” అని శివకుమార్ హితవు పలికారు.

Read More : బెంగళూరు తొక్కిసలాటపై అసెంబ్లీలో రాజకీయ దుమారం

One thought on “బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో చేతులు కలపను: డీకే శివకుమార్ స్పష్టం

Comments are closed.