చైనా శాస్త్రవేత్తలు ఎనర్జీ రంగంలో సంచలనాత్మక పరిణామాన్ని వెల్లడించారు. అధిక శక్తిని ఉత్పత్తి చేసే, స్వచ్ఛమైన భవిష్యత్తుకు దోహదపడే రేడియోధార్మిక మూలకం థోరియం (Thorium) దేశంలో భారీగా ఉన్నట్లు గుర్తించారు. తాజా అంచనాల ప్రకారం, ఈ థోరియం నిల్వలు చైనాను 60,000 సంవత్సరాలపాటు విద్యుతీకరించగల సామర్థ్యం కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
థోరియం వర్సెస్ యురేనియం (Uranium)
సాంప్రదాయ యురేనియం (Uranium) ఆధారిత అణుశక్తి ఉత్పత్తితో పోల్చితే, థోరియం 200 రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలదు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. థోరియం ఆధారిత మోల్టెన్-సాల్ట్ రియాక్టర్లు (Molten-Salt Reactors) చిన్నవి, వాటికి నీటి శీతలీకరణ అవసరం ఉండదు. అంతేగాక, వీటిలో మెల్ట్‌డౌన్ (Meltdown) ప్రమాదం లేదు. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే రేడియోధార్మిక వ్యర్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
భారీగా థోరియం నిల్వల గుర్తింపు
చైనా భూగర్భ సర్వే (Geological Survey) ప్రకారం, దేశవ్యాప్తంగా 233 థోరియం అధిక స్థాయిలో ఉండే జోన్లను గుర్తించారు. ముఖ్యంగా, బాయన్ ఓబో (Bayan Obo) అనే ఐరన్ ఓర్ (Iron Ore) గని వద్ద గత అయిదేళ్లుగా పేరుకుపోయిన మైనింగ్ వ్యర్థాల్లో (Mining Waste) మాత్రమే అమెరికా మొత్తం 1,000 సంవత్సరాల పాటు అవసరమైన శక్తిని ఉత్పత్తి చేసేందుకు సరిపడా థోరియం నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ గణనీయమైన ఆధారాలు థోరియం ఆధారిత అణుశక్తి భవిష్యత్తును సమర్థవంతంగా మలచగలదని విశ్లేషకులు అంటున్నారు. థోరియం వినియోగంపై ప్రపంచ దేశాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

One thought on “చైనా లో భారీ థోరియం (Thorium) నిల్వలు కనుగొన్న శాస్త్రవేత్తలు!”
Comments are closed.