ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధానంపై సీఎం దృష్టి.

ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. గోదావరి, కృష్ణ, పెన్న నదుల అనుసంధానానికి రూ.84 వేల కోట్ల ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు. సముద్రంలో వృథాగా కలిసే జలాలను రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వివాదాస్పదం చేస్తున్నారని విమర్శించారు. ఈ అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో రెండో పంట సాగుకు నీరు అందించాలన్నదే సీఎం లక్ష్యమని ఆనం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేయలేక హంద్రీ-నీవా ప్రాజెక్టును విస్మరించిందని, కానీ కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తుచేశారు. నీటి సరఫరా చివరి వరకు అందించాలన్నదే తమ సంకల్పమని తెలిపారు.

ఈ నెల 30న సీఎం చంద్రబాబు అనుసంధాన ప్రాజెక్టు ప్రదేశాలను సందర్శించనున్నారని ఆనం ప్రకటించారు. ప్రస్తుతం సోమశిల నుంచి 18,750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని, సోమశిల-కండలేరు ప్రాజెక్టుల్లో 150 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

మాజీ సీఎం జగన్ పాలనలో సోమశిల-కండలేరు ఫ్లడ్ ఛానల్ సామర్థ్యం పెంపుపై ఆలోచన లేకుండా కేవలం కమిషన్ల కోసం టెండర్లు పిలిచారని ఆనం విమర్శించారు. సోమశిల హై లెవెల్ కెనాల్ భూసేకరణ కోసం సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారని తెలిపారు.

జిల్లాలో 40 పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.12.8 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించామని ఆనం వివరించారు. గత ప్రభుత్వం పంచాయతీల నిధులను వేరే దారికి మళ్లించిందని, ఇప్పుడు కూడా తమ ప్రభుత్వం నిధులు ఇస్తున్నా వైసీపీ ప్రతినిధులు సహకరించడం లేదని మండిపడ్డారు.

Read More : కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్