సెనా దేశాల్లో చరిత్ర సృష్టించిన బుమ్రా

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్‌లో మరో చరిత్రను సృష్టించాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సెనా దేశాలు) కలిపి 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్న బుమ్రా, భారత బౌలర్లలో ప్రత్యేక స్థానం సంపాదించాడు.

ఈ మ్యాచ్‌లో బుమ్రా 24.4 ఓవర్లు వేసి 83 పరుగులిచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను కుదిపేశాడు. సెనా దేశాల్లో ఇది బుమ్రాకు పదో ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. ఇలా అత్యధికసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా ఆయన నిలిచాడు. మరో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేస్తే పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రమ్ (11 ఐదు వికెట్ల ప్రదర్శనలు) రికార్డును బుమ్రా చెరిపేస్తాడు.

ఇక విదేశీ గడ్డపై టెస్టుల్లో బుమ్రాకు ఇది 12వ ఐదు వికెట్ల ఘనత. దీంతో ఈ రికార్డును భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో సమం చేశాడు. అయితే కపిల్ 66 టెస్టుల్లో ఈ ఘనతను సాధించగా, బుమ్రా కేవలం 34 టెస్టుల్లోనే ఇది సాధించడం గమనార్హం. ఆస్ట్రేలియాలో నాలుగు, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో చెరో మూడు, వెస్టిండీస్‌లో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు బుమ్రా నమోదు చేశాడు. భారత్‌లో మాత్రం కేవలం రెండు సార్లు మాత్రమే ఈ ఫీట్‌ చేశాడు.

Read More : లీడ్స్ టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ

One thought on “సెనా దేశాల్లో చరిత్ర సృష్టించిన బుమ్రా

Comments are closed.