పక్షుల, జంతువుల తాకిడులతో ఎలెర్ట్ లో ఏవియేషన్ రంగం

అహ్మదాబాద్‌లో ఇటీవల ఎయిర్ ఇండియా విమానానికి సంభవించిన ప్రమాదం తరువాత దేశవ్యాప్తంగా విమాన భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో పక్షులు, వన్యప్రాణులు ఢీకొనే సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇది హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా మినహాయింపు కాదు. ఈ ఏడాది (2025) తొలి ఐదు నెలల్లోనే 49 పక్షుల, జంతువుల తాకిడి ఘటనలు ఇక్కడ నమోదయ్యాయి. పైగా 11 మేడే కాల్స్ రావడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. గతంలో 2022లో 92, 2023లో 136, 2024లో 143 ఘటనలు నమోదవ్వగా.. ఈ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ఇది హైదరాబాద్‌కి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం, 2022లో దేశవ్యాప్తంగా 1,633 ఘటనలు, 2023లో 2,269 ఘటనలు, 2024లో 2,066 పక్షుల తాకిడి ఘటనలు నమోదయ్యాయి. 2025లో మే నెల వరకే 641 ఘటనలు నమోదయ్యాయి.

ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2022లో 442, 2023లో 616, 2024లో 419, 2025లో మే నాటికి 95 ఘటనలు చోటుచేసుకున్నాయి. అదే అహ్మదాబాద్‌లో 2022లో 80 ఘటనలు ఉంటే, 2023లో ఇది 214కి పెరిగింది.

విమానాశ్రయాల చుట్టూ విస్తరిస్తున్న పట్టణీకరణ, చెత్త నిర్వహణ లోపాలు, పక్షులకు ఆహారం లభించే స్థలాలు పెరగడం వంటి అంశాలు ఈ సమస్యలకు కారణమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఈ ప్రమాదాలను నివారించేందుకు పలు విమానాశ్రయాలు చర్యలు తీసుకుంటున్నాయి. రన్‌వే వద్ద రెగ్యులర్ పెట్రోలింగ్, పక్షులను భయపెట్టే పరికరాల వినియోగం, ప్రత్యేక వన్యప్రాణి వ్య‌వ‌స్థప‌ర‌త బృందాలు ఏర్పాటు చేయడం వంటి పద్ధతులను పాటిస్తున్నారు.

హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అయితే మరింత కఠిన చర్యలు అవసరమవుతున్నాయి. ముఖ్యంగా చెత్త పర్యవేక్షణ, బహిరంగ మాంసవధి నిలిపివేయడం, పక్షులను ఆకర్షించే వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాల్లో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు మరింత చురుకుగా వ్యవహరించాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విమాన ప్రయాణ భద్రత కోసం ప్రభుత్వాలు, విమానాశ్రయ అధికారులు, స్థానిక సంస్థలు ఒకటిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే తప్ప.. ఈ ప్రమాదాలను పూర్తిగా నివారించడం కష్టమేనని విమానయాన నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More : ఆదిభట్ల వద్ద ఘోర రోడ్డుప్రమాదం

One thought on “పక్షుల, జంతువుల తాకిడులతో ఎలెర్ట్ లో ఏవియేషన్ రంగం

Comments are closed.