బిహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కసరత్తులు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో బిహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఇంకా సీట్ల పంపకాల ఫార్ములా ఖరారు కాకపోవడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో బీజేపీతో పాటు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), జితిన్ రామ్ మాంఝీ పార్టీ హెచ్ఏఎం (సెక్యులర్), ఉపేంద్ర కుష్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి.
2020 ఎన్నికల్లో జేడీయూపై ఎల్జేపీ అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ, ఈసారి చిరాగ్ పార్టీ అధికారికంగా ఎన్డీయే భాగస్వామిగా చేరింది. అయితే, ఎల్జేపీ 40 సీట్లు కోరుతున్నప్పటికీ అంత పెద్ద సంఖ్యలో లభించడం కష్టమని అంటున్నారు. ఇదే సమయంలో హెచ్ఏఎం పార్టీ కనీసం 35-40 సీట్లలో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. జేడీయూ మాత్రం 100 సీట్లపై పట్టుబడుతుండగా, ఆర్ఎల్ఎం కూడా ఎక్కువ సీట్లు ఆశిస్తోంది. దీంతో సీట్ల షేరింగ్ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
2020 ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74 స్థానాలు గెలిచింది. జేడీయూ 115 సీట్లలో పోటీ చేసి 43 గెలిచింది. ఎల్జేపీ 135 సీట్లలో పోటీ చేసినా ఒక్కదాంట్లోనే విజయం సాధించింది. అయితే జేడీయూ కనీసం 30 చోట్ల ఓటమికి ఎల్జేపీ కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. హెచ్ఏఎం 7 సీట్లలో పోటీ చేసి 4 గెలిచింది. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) 11 సీట్లలో పోటీ చేసి 4 గెలుచుకుంది.
ఇక ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే సీట్ల పంపకం ఎలా ఉండబోతుందో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
Read More
: బైక్ పోగొట్టుకున్న యువకుడికి రాహుల్ గాంధీ కొత్త బైక్ గిఫ్ట్.
2 thoughts on “బిహార్ ఎన్నికలు: ఎన్డీయే సీట్ల పంపకంపై అమిత్ షా కీలక సమావేశం.”
Comments are closed.