భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభ వేళలో అపూర్వ ఘటన చోటు చేసుకుంది. నిన్న (గురువారం) జరగాల్సిన అంకురార్పణ కార్యక్రమం ఏకంగా ఆరు గంటల పాటు ఆలస్యం కావడం భక్తులలో ఆగ్రహానికి దారి తీసింది.
అయితే ఈ ఆలస్యానికి ప్రధాన కారణం రామాలయం ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాసరామానుజంపై వచ్చిన వివాదమే. ఓ భక్తుడు తమ భక్తిభావంతో అందించిన నగదును స్వీకరించినందుకు ఈవో రమాదేవి ఆ అర్చకుడిని పర్ణశాల ఆలయానికి బదిలీ చేశారు. ఈ విషయంపై అర్చకులంతా కలసి ఈవోను కలిసి శ్రీనివాసరామానుజాన్ని మళ్లీ భద్రాచలానికి రప్పించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఈవో నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిలిపివేశారు.
ఈ వివాదం నేపథ్యంలో అర్చకులు, ఈవో మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏకంగా ఆరు గంటల పాటు అంకురార్పణ కార్యక్రమం నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరికి ఉప ప్రధాన అర్చకుడిని ఈవో పిలిపించడంతో నవమి వేడుకలు రాత్రి ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
భద్రాచలం చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ఈవో రమాదేవికి వైదిక సిబ్బందికి ఉన్న విభేదాలు రామాలయంలో పెద్ద వివాదానికి దారి తీశాయని భక్తులు మండిపడ్డారు. ప్రతీ శ్రీరామనవమికి భద్రాచలం రామాలయంలో అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారు. ఏప్రిల్ 6న జరగనున్న సీతారాముల కళ్యాణానికి సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం ఆలస్యానికి ఈ వివాదం ప్రధాన కారణంగా మారింది.
భద్రాచలంలో పాలకమండలి లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని భక్తులు ఆరోపిస్తున్నారు. చివరకు అర్చకుల నిరసనకు తలొగ్గిన ఈవో ఉపప్రధాన అర్చకుడిని తిరిగి పిలిపించడంతో అంకురార్పణ కార్యక్రమం రాత్రి 10 గంటలకు ప్రారంభమైంది.

One thought on “భద్రాచలం రామాలయంలో అపచారం..”
Comments are closed.