బయ్యవరం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీకి కఠిన ఆదేశాలు

chandrababu

అనకాపల్లి జిల్లా బయ్యవరం వద్ద జరిగిన మహిళ హత్య కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్‌ను ఆదేశించారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, ఎస్పీ వకుల్ జిందాల్‌కు ఫోన్ చేసి ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ సీఎం చంద్రబాబుకు నివేదించారు. ఈ దారుణానికి పాల్పడిన వారికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం స్పష్టంగా ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులు, మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మహిళలపై దాడులకు పాల్పడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం స్పష్టం చేశారు.

ఎమిటీ ఘటన?

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం వద్ద దుండగులు ఓ మహిళను హత్య చేసి ఆమె శరీర భాగాలను జాతీయ రహదారి పక్కన కల్వర్టు కింద పడేశారు. స్థానికులు ఈ ఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన మహిళకు సుమారు 40 సంవత్సరాల వయస్సు ఉంటుందని, చేతికి బంగారు రంగు గాజులు, పచ్చబొట్లు ఉన్నట్లు గుర్తించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో దర్యాప్తును మరింత వేగవంతం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read More

One thought on “బయ్యవరం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీకి కఠిన ఆదేశాలు

Comments are closed.