బీఆర్ఎస్ సీనియర్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ (60) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ వార్తతో ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మదన్ లాల్ 2009లో వైరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. మొదటి ఎన్నికలో సీపీఐ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన ఆయన, 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014లో వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.
ఇటీవల వరకు వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మదన్ లాల్, ప్రజలకు చేరువగా ఉండే నేతగా పేరొందారు. మదన్ లాల్‌కు భార్య మంజుల, కుమారుడు మృగేందర్ లాల్ ఉన్నారు. ఆయన కుమారుడు ప్రస్తుతం ఐపీఎస్ అధికారిగా సేవలందిస్తున్నారు.
మదన్ లాల్ మృతిపై పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు. పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని కొనియాడారు.
Read More : ఫార్ములా ఈ కేసు విచారణకు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.

2 thoughts on “వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కన్నుమూత.”
Comments are closed.