భారత్‌లో తలదాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెంటనే తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో భారత్ తమ మనస్సాక్షి మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ కార్యాలయం ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. “షేక్ హసీనాను అప్పగించాలన్న మా విజ్ఞప్తిని భారత్ ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఈ అంశంలో ఇక జాప్యం మంచిది కాదు” అని యూనస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మానవత్వానికి విరుద్ధంగా నేరాలు చేసిన వ్యక్తిని ఆశ్రయించడం ప్రజాస్వామ్య విలువలకు భిన్నమని హితవు పలికింది. చట్టం ముందు ఎవ్వరూ ప్రత్యేకులు కాదని, బాధితులకు న్యాయం జరగాల్సిందేనని తెలిపింది.
ప్రాంతీయ సంబంధాలు, రాజకీయ పరిణామాలు తప్పిదాలను కప్పిపుచ్చలేవని బంగ్లా ప్రభుత్వం పేర్కొంది. ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవించే భారత్ ఈ విషయంలో చట్టబద్ధ నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
గత ఏడాది విద్యార్థుల ఆందోళనల కారణంగా షేక్ హసీనా తన పదవిని కోల్పోయారు. ఆ సమయంలో ఆమె పార్టీ మద్దతుదారులు మైనారిటీలపై దాడులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ అల్లర్లలో 1,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. దీంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన యూనస్ ప్రభుత్వం హసీనాపై హత్య సహా పలు కేసులు నమోదు చేసింది. అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే ఆమెకు కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ప్రస్తుతం షేక్ హసీనా ఆగస్టు 5 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Read More : మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం

One thought on “Sheikh Hasina : భారత్‌ను కోరిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం”
Comments are closed.