కరీంనగర్‌లో నిర్మించాల్సిన టీటీడీ ఆలయానికి తగిన వేగం అందించాల్సిందిగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రజల్లో భారీగా ఆసక్తి ఉండగా, పనులు ఇంకా మొదలవకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు బీఆర్ నాయుడుకు లేఖ రాసిన బండి సంజయ్, ఆలయ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన అవసరం ఉందన్నారు. 2023 మే 31న కరీంనగర్ పద్మానగర్‌లోని 10 ఎకరాల స్థలంలో భూమి పూజ జరిగినప్పటికీ ఇప్పటివరకు నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీటీడీ చైర్మన్ నాయకత్వంలో తిరుమలలో చేపట్టిన చర్యలు భక్తుల ప్రశంసలు పొందాయని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంతో పాటు దేవాలయాల అభివృద్ధి కోసం టీటీడీ చేస్తున్న కృషిని కొనియాడారు. ధూప, దీప, నైవేద్య సేవలు అందని దేవాలయాలకు టీటీడీ తోడుగా నిలుస్తుండడాన్ని ప్రశంసించారు.
కరీంనగర్‌తో పాటు పొరుగు జిల్లాల ప్రజలు ఈ ఆలయ నిర్మాణానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆలయ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Read More : Genco లో భూములు కోల్పోయిన 112 మందికి ఉద్యోగాలు..

One thought on “కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి వేగం తెచ్చేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ..”
Comments are closed.