ప్రభుత్వ ఉద్యోగాలు లభించని వారికి ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో భూములను కోల్పోయిన 112 మంది భూ నిర్వాసితులకు జెన్కో ఉద్యోగాలు కల్పించబడినట్టు ఆయన ప్రకటించారు. నియామక పత్రాలను స్వయంగా అందజేసిన భట్టి, ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకే నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క, ప్రత్యేక తెలంగాణ కోసం యువత పోరాడినట్లు గుర్తు చేస్తూ, వారి ఆశలకు తగిన ఫలితాలు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటివరకు 53,000 మందికి నియామక పత్రాలు అందించినట్టు తెలిపారు.
గత ప్రభుత్వాలు భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినప్పటికీ, హామీలు అమలు చేయలేదని విమర్శించిన భట్టి విక్రమార్క, ప్రస్తుత ప్రభుత్వం వెంటనే ఉపాధి కల్పన చేపడుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని వారికి “రాజీవ్ యువ వికాసం” పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఇందుకోసం రూ. 9000 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
హైదరాబాద్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో అనేక అంతర్జాతీయ కంపెనీలు అవకాశాలు పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు. ఐటీ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ నాయకులు చేసిన కృషిని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులతో ఉద్యోగావకాశాలు పెరగనున్నాయని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.

One thought on “Genco లో భూములు కోల్పోయిన 112 మందికి ఉద్యోగాలు..”
Comments are closed.