CM : ‘జీరో ఫేర్ టికెట్’తో ప్రయోజనాలు స్పష్టంగా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ప్రయోజనాల కోసం రూపొందించిన కీలక పథకం – ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి రానుంది. దీనిలో భాగంగా ప్రయాణించే ప్రతి మహిళకు ‘జీరో ఫేర్ టికెట్’ జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

సచివాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ – ఈ టికెట్‌లో మహిళలు చేసిన ప్రయాణ వివరాలు, ఉచిత బస్సు సేవల వల్ల వారికి ఆదా అయిన మొత్తం, ప్రభుత్వం అందిస్తున్న 100 శాతం రాయితీ వివరాలు స్పష్టంగా ఉండాలన్నారు. ప్రజలకు ఈ పథకం లబ్ధి ఎలా కలిగించిందో వారు సులభంగా తెలుసుకునేలా టికెట్ డిజైన్ చేయాలని సూచించారు. దీనికోసం అవసరమైన సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి సంబంధించి అధికారులను సన్నద్ధం కావాలని తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న మహిళా ఉచిత బస్సు పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించిన సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం అమలు చేసే ఈ పథకం అచూకీగా ఆగస్టు 15న ప్రారంభం కావాలని స్పష్టం చేశారు.

ఆర్టీసీ లాభదాయక మార్గంలోకి రావాలి: సీఎం

ఈ ఉచిత పథకం వల్ల ఆర్టీసీపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వ్యయ నియంత్రణ చర్యలపై సీఎం దృష్టిసారించారు. ఆదాయ మార్గాల విస్తరణ, నిర్వహణ వ్యయాల తగ్గింపు ద్వారా ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని సూచించారు. లాభదాయక వ్యూహాల రూపకల్పన కోసం కార్యాచరణ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎలక్ట్రిక్ బస్సులకు అధిక ప్రాధాన్యత

రాష్ట్ర రవాణా వ్యవస్థను ఆధునీకరించే భాగంగా ఇకపై ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని సూచించారు. ఈ బస్సులకు అవసరమైన విద్యుత్‌ను రాష్ట్రమే ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అంశంపై కూడా అధ్యయనం చేయాలని సూచించారు.

ఇలాంటి చర్యల ద్వారా ఆర్టీసీ ఆర్థికంగా బలపడుతుందని, స్వయంసమృద్ధిని సాధించగలదని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

One thought on “CM : ‘జీరో ఫేర్ టికెట్’తో ప్రయోజనాలు స్పష్టంగా!

Comments are closed.