ఏపీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని రెండో రోజూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) కస్టడీలోకి తీసుకుంది. శనివారం ఉదయం విజయవాడ జైలులో నుంచి అతడిని తీసుకెళ్లి, ముందుగా ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించి విచారణ కొనసాగించారు. కోర్టు ఇచ్చిన అనుమతితో సిట్ అధికారులకు వారం రోజుల కస్టడీ లభించగా, నిన్న మొదటి రోజు విచారణలో మద్యం కుంభకోణానికి సంబంధించి పలు కీలక ప్రశ్నలు వేశారు.
అయితే చాలా ప్రశ్నలకు రాజ్ సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పనలో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ ఇప్పటికే నిర్ధారించింది. మూడు సంవత్సరాల పాటు కొనసాగిన ఈ వ్యవహారానికి సంబంధించి, పాలసీపై ఎవరెవరు నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో వాణిజ్యంగా విజయవంతంగా కొనసాగుతున్న పాత బిస్టిలరీలపై అణిచివేత, కొత్త కంపెనీలకు అవకాశాలిచ్చి, వాటి ద్వారా మద్యం తయారీ, నెలవారీ ముడుపుల వసూలు వ్యవహారాన్ని రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో నడిపినట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంలో ఉన్న ఆధారాలను రాజ్ ఎదుట ఉంచినా, అతను “తనకు తెలియదు, తాను కేవలం పాలసీ అమలు చేశాను” అని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సిట్ అధికారులకు కొన్ని కీలక ఆధారాలు లభించాయని సమాచారం. అంతేకాదు, మూడురోజుల క్రితం రాజ్ పర్సనల్ అసిస్టెంట్ పైలా దిలీప్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్‌ను రాజ్ ఎదుట ఉంచి, సమన్వయంగా విచారణ జరిపే అవకాశం ఉంది. వారం రోజుల కస్టడీ ముగిసే నాటికి ఈ మద్యం స్కాం వెనుక ఉన్న అసలైన సూత్రధారులపై స్పష్టత రావొచ్చని అనుకోవచ్చు.
మద్యం స్కాం కేసులో మిగిలిన కీలక అంశాలపై రాజ్ ఎలాంటి సమాధానాలు ఇస్తారో, మరెన్ని వివరాలు బయటకు వస్తాయో చూడాల్సి ఉంది.
Read More : ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం : CBN
