ఏపీ లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి కోర్టు వాదనలు…

ఏపీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సిట్ అధికారులు మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి కోర్టులో స్వయంగా తన వాదనలను వినిపించారు.

తన పీఏగా చెప్పబడుతున్న బాలాజీ ప్రభుత్వ ఉద్యోగి అని చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు అధికార వాహనాలు వాడే అవకాశం లేదని, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. తనకు ఎగుమతుల వ్యాపార పనులుంటాయని, అందులో భాగంగా తరచూ కొలంబోకు వెళ్లాల్సి వచ్చేది అని తెలిపారు. మంగళవారం కూడా అదే ఉద్దేశంతో బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లగా, ఇమిగ్రేషన్ అధికారులు తనపై ఎల్ఓసీ ఉందని చెప్పి ఆపిన విషయాన్ని కోర్టుకు వివరించారు.

ఇక గన్‌మన్ గిరిని ప్రలోభ పెట్టి తనపై మేల్కొలిపే విధంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. మరో గన్‌మన్ మదన్ రెడ్డి మాత్రం సిట్‌కు అనుకూలంగా చెప్పనందుకే పోలీసులు అతనిపై దాడి చేశారని, ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. దీనిపై విచారించిన న్యాయాధికారి చెవిరెడ్డి రిమాండ్‌ను మంజూరు చేశారు. అయితే, తనకు వెన్నునొప్పి ఉందని, జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని చెవిరెడ్డి అభ్యర్థించడంతో… న్యాయాధికారి మంచం, దిండు, దుప్పటి, దోమతెరకు అనుమతి ఇచ్చారు.

Read More : అంబటి రాంబాబుపై పోలీసుల కేసు నమోదు