ఏపీని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దనున్న లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆచరణాత్మక చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం హోదాలో టాటా మోటార్స్‌కు రూపాయికే భూమి కేటాయించిన తీరు ప్రేరణగా తీసుకుని, రాష్ట్రంలో ప్రముఖ ఐటీ కంపెనీలకు నామమాత్రపు లీజు ధరలకే భూములు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. జాతీయ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాఖపట్నాన్ని అంతర్జాతీయ ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని, కాగ్నిజెంట్ సంస్థకు కేవలం ఒక్క రూపాయి లీజుపై 21.31 ఎకరాల భూమిని కేటాయించామని పేర్కొన్నారు. ఈ సంస్థ రూ.1,582 కోట్లతో క్యాంపస్ నిర్మించి 8,000 మందికి ఉపాధిని కల్పించనుంది. అలాగే, టీసీఎస్ సంస్థకు 99 పైసలకే 21.16 ఎకరాల భూమిని కేటాయించగా, వారు రూ.1,370 కోట్ల పెట్టుబడితో 12,000 ఉద్యోగాలు సృష్టించనున్నట్లు తెలిపారు. టాప్ 100 గ్లోబల్ ఐటీ కంపెనీలకు ఇదే విధానాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.

మూడు రాజధానులపై స్పష్టత
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై మంత్రి లోకేశ్ స్పందించారు. తాజా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మూడు రాజధానుల పాలసీకి వ్యతిరేకమని, ముఖ్యంగా విశాఖలో వైఎస్సార్సీపీకి ఓటమి ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా చూపుతోందని పేర్కొన్నారు. విశాఖను ఐటీ హబ్‌తో పాటు గ్లోబల్ కెమికల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, నూతన ఎయిర్‌పోర్ట్, దేశంలో అతిపెద్ద ఉక్కు కర్మాగార స్థాపనకు కూడా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

తెలంగాణతో సఖ్యత – నీటి వివాదాలపై స్పష్టత
తెలంగాణతో ఏర్పడుతున్న అభివృద్ధి సంబంధాలపై కూడా లోకేశ్ స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల మేలు కోసం పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. నీటి వనరులను సంరక్షిస్తూ వృధా అరికట్టడమే ముఖ్యమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

‘రెడ్ బుక్’ అంశంపై హెచ్చరిక
గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై తమ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించదని, ఇప్పటికే కొన్ని ప్రభుత్వాధికారులను సస్పెండ్ చేశామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాకినాడ పోర్ట్, భూకబ్జాలు వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రజలు 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.

Read More : ఏఐ సాయంతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

One thought on “ఏపీని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దనున్న లోకేశ్

Comments are closed.