ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల — టాప్‌లో నిలిచిన మూడు జిల్లాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదలయ్యాయి. ఈసారి ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం. గత ఏడాది కంటే ఈసారి ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణుల సంఖ్య పెరిగింది. ఫస్టియర్‌లో 3 శాతం, సెకండియర్‌లో 5 శాతం వరకు పాస్‌ పర్సెంట్ పెరిగినట్లు సమాచారం.

ఈ ఫలితాల్లో మూడు జిల్లాలు టాప్‌-3 స్థానాల్లో నిలవడం విశేషంగా మారింది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణతను సాధించారు. మరోవైపు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, చిత్తూరు జిల్లాలు ఈ జాబితాలో చివరి వరుసలో నిలిచాయి.

ప్రధానంగా ఫస్టియర్‌, సెకండియర్‌ రెండు సంవత్సరాల్లోనూ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలే అగ్రస్థానాల్లో నిలవడం గమనార్హం. తక్కువ ఉత్తీర్ణత నమోదైన జిల్లాల విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాలని విద్యావర్గాలు సూచిస్తున్నాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో విడుదల చేశారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కళాశాలల్లో విద్యార్థుల ప్రదర్శన మరింత మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు. ఈ విజయానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి అహర్నిశ కృషి కారణమని అభినందించారు.

తక్కువ మార్కులు సాధించిన లేదా ఉత్తీర్ణత పొందని విద్యార్థులు నిరాశ చెందవద్దని, ఇది ఒక ఓటమి కాదని, మరింత శ్రమించి విజయం సాధించాలని మంత్రి లోకేష్‌ హితవు పలికారు. ‘‘మీరు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాలను సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

👉 ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ సహా, మన మిత్ర వాట్సాప్‌, మన బడి పోర్టల్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Read More : పవన్ కల్యాణ్ కుమారుడిని కాపాడిన భారతీయులకు సింగపూర్ ప్రభుత్వ సత్కారం