అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం ధర్మవరం గ్రామాన్ని శనివారం హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా పలు కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పల్లా అప్పలరాజును పరామర్శించి ధైర్యం చెప్పగా, అనారోగ్యంతో ఉన్న టీడీపీ సీనియర్ నేత కలిగట్ల సూర్యనారాయణను కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, గ్రామంలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా హోంమంత్రి అనిత ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు. “ఇది ఓ ఎన్నికల పర్యటన కాదని, ప్రజల సమస్యలపై పరిష్కారాలు తెలుసుకునేందుకే వచ్చినట్టు” స్పష్టం చేశారు. ధర్మవరం గ్రామ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనపై విమర్శలు చేసిన అనిత.. గ్రామాల్లో అభివృద్ధికి నిధులు లేక నిర్లక్ష్య స్థితి ఏర్పడిందన్నారు. “సర్పంచ్‌లకు బ్లీచింగ్ పౌడర్ కొనుగోలుకే డబ్బులు లేవు. నాడు-నేడు పేరుతో నిధులు దుర్వినియోగమయ్యాయి. పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి” అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, ‘ఈగల్’ అనే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. గంజాయి కేసుల్లో జీరో టాలరెన్స్‌తో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్, టాయ్ ఇండస్ట్రీస్ ఏర్పాటుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించనున్నట్టు హోంమంత్రి అనిత తెలిపారు.
Read More : సింహాచలంలో భారీ ప్రమాదం తప్పింది

One thought on “హోంమంత్రి అనిత పర్యటన: ప్రజల సమస్యలపై”
Comments are closed.