దేశ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ తనదైన ముద్ర వేయడానికి శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రేపు విజయవాడ నోవోటెల్ హోటల్‌లో దేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్‌ను ప్రారంభించనుంది. “సౌర, పవన శక్తికి నైపుణ్య హబ్‌గా ఏపీ” అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్వనీతి ఇనిషియేటివ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి 250కి పైగా పరిశ్రమల ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు హాజరుకానున్నారు. భారతదేశం 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సాధన దిశగా వేగంగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ వర్క్‌ఫోర్స్ విప్లవానికి కేంద్రబిందువుగా ఎదగనుందని అధికారులు పేర్కొన్నారు.
యువతకు విస్తృత శిక్షణ
ఈ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువతకు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో తయారీ, ఇన్‌స్టలేషన్, ఆపరేషన్స్, నిర్వహణ వంటి విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఇది కేవలం నైపుణ్య శిక్షణ మాత్రమే కాకుండా వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీ డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సమగ్ర ప్రోగ్రామ్‌గా నిర్వాహకులు వెల్లడించారు. 2030 నాటికి 160 గిగావాట్ల సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
హై-ఇంపాక్ట్ చర్చలు
ఈ సమావేశంలో మూడు హై-ఇంపాక్ట్ ప్యానెల్ డిస్కషన్స్ జరగనున్నాయి. సోలార్, విండ్ రంగాల ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు, పాలసీ మేకర్లు, శిక్షణ సంస్థలు కలిసి డిమాండ్ ఆధారిత వర్క్‌ఫోర్స్ అభివృద్ధి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. అదనంగా ప్రైవేట్ సెక్టార్ గ్రీన్ స్కిల్లింగ్ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రంగానే కాకుండా గ్లోబల్ టాలెంట్ ఎగుమతిదారుగా నిలబెట్టే దిశగా పెద్ద అడుగుగా భావిస్తున్నారు.

One thought on “గ్రీన్ వర్క్‌ఫోర్స్ విప్లవంలో ఏపీకి కీలక పాత్ర”
Comments are closed.