Minister : కూటమి ప్రభుత్వ ఏడాది విజయాలు

Nara Lokesh

కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. కూటమి పాలన ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తయిందని, సుపరిపాలన వైపు తొలి అడుగు వేసిన ప్రభుత్వం ఇప్పుడు వికాస మార్గంలో దూసుకుపోతున్నదని వెల్లడించారు.

మోడీ, చంద్రబాబు నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్‌తో ముందుకు పోతున్నామని చెప్పారు. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేస్తోందని వివరించారు. డీఎస్సీని నిలిపివేయాలని ప్రతిపక్షం దాఖలు చేసిన 24 కేసులన్నీ కూడా కోర్టుల్లో కొట్టివేయబడినట్టు పేర్కొన్నారు.

గత పదేళ్లలో రానివ్వని పెట్టుబడులను కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్రానికి ఆహ్వానించామని తెలిపారు. రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగి, దాంతో 8.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్, రిలయన్స్ రెన్యూ పవర్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి మద్దతుతో విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించగలిగామని, భోగాపురం విమానాశ్రయ నిర్మాణం వేగంగా కొనసాగుతోందని చెప్పారు.

ఇక సంక్షేమంలోనూ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి వివరించారు. వృద్ధులకు నెలకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు, మంచానికే పరిమితమైన వారికి నెలకు రూ.15వేలు అందజేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 203 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించామని చెప్పారు. త్వరలో ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అందిస్తున్నామని తెలిపారు.

బాబు సూపర్ సిక్స్ హామీలలో భాగంగా తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. పిల్లల సంఖ్యను బట్టి తల్లుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నామన్నారు. రెండు పిల్లలుంటే రూ.26వేలు, ముగ్గురైతే రూ.39వేలు వారి ఖాతాల్లో జమవుతాయని తెలిపారు.

చివరగా సంక్షేమం, అభివృద్ధి అనే జోడెద్దుల బండి ద్వారా ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చిన క్లియర్ మాండేట్‌ను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

Read More : సీఎం ఏడాది పాలన వైఫల్యాలపై వైసీపీ విమర్శలు

One thought on “Minister : కూటమి ప్రభుత్వ ఏడాది విజయాలు

Comments are closed.