ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులు, భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై ప్రధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కేబినెట్‌లో సుమారు రూ.53,922 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. వీటి ద్వారా రాష్ట్రంలో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. ఏరోస్పేస్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ, ఎనర్జీ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పారిశ్రామిక పార్కులు, ఎకో సిస్టమ్స్, బిజినెస్ సెంటర్ల అభివృద్ధికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక, సీఆర్డీఏ ప్రతిపాదనలు, అర్బన్ డిజైన్ మార్గదర్శకాలు, కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులు, ఎస్పీవీ ప్రాజెక్టులకు అనుమతులు, ల్యాండ్ పూలింగ్‌కు లోబడని భూముల సేకరణ అంశాలు కూడా కేబినెట్ అజెండాలో ఉండనున్నాయి.
అసెంబ్లీ సమావేశాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నెల 18వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభించాలన్న ప్రతిపాదనపై చర్చ జరగనుంది. రాష్ట్ర అభివృద్ధికి మద్దతుగా ప్రైవేట్ సంస్థలకు భూముల కేటాయింపు, పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి. గతంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలకు కేబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ ఫేక్ ప్రచారాలు, ఎమ్మెల్యేలు-మంత్రుల పనితీరు అంశాలపై సీఎం చంద్రబాబు స్పందించే అవకాశం ఉంది.
Read More : ఏపీ లిక్కర్ కుంభకోణం: సిట్ దూకుడు, చెవిరెడ్డి కంపెనీల్లో సోదాలు.