రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కంపెనీతో పాటు, దాని ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ డి. అంబానీని అధికారికంగా ‘ఫ్రాడ్ (మోసం)’గా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వర్గీకరించింది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌కి వెల్లడించారు. ఆర్బీఐ రూపొందించిన ‘మోసం మేనేజ్మెంట్ మాస్టర్ డైరెక్షన్స్’కు అనుగుణంగా, జూన్ 13న ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే జూన్ 24న ఆర్బీఐకి ఈ వర్గీకరణను తెలియజేసినట్టు వెల్లడించారు.
రూ. 3,000 కోట్లకు పైగా బకాయిలు
ఎస్బీఐకి ఆర్‌కామ్ నుంచి రూ. 2,227 కోట్ల ఫండ్ బేస్డ్ రుణం, రూ. 786 కోట్ల నాన్-ఫండ్ బేస్డ్ గ్యారెంటీలు బకాయి ఉన్నాయని వెల్లడించారు. మొత్తం రుణ బకాయిలు రూ. 40,000 కోట్లను అధిగమించాయని రాయిటర్స్ తెలిపింది.
ఇన్సాల్వెన్సీ ప్రక్రియలో సంస్థ
ప్రస్తుతం ఆర్‌కామ్ కంపెనీ ఐబీసీ చట్టం కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రక్రియలో ఉంది. 2020లోే రిజల్యూషన్ ప్లాన్ దాఖలైనా, ఇంకా ఆమోదం లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీపై వ్యక్తిగత ఇన్సాల్వెన్సీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
గతంలోనూ చట్టపరమైన సమస్యలు
2020లోనూ ఇదే మోసం వర్గీకరణపై వివాదం చెలరేగింది. అప్పట్లో ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అనంతరం 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రుణగ్రహీతకు సమర్థన సమయం ఇవ్వాలని చెప్పింది. ఈ నేపథ్యంలో గత వర్గీకరణను రద్దు చేసిన ఎస్బీఐ, ఇప్పుడు 2024 జూలై 15న కొత్త ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా మరోసారి మోసం వర్గీకరణ చేసింది.
Read More : అనూహ్యంగా ఉప రాష్ట్రపతి రాజీనామా
