నదులు ఉధృతంగా, ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదల.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నదులు, జలాశయాలు ఉధృతంగా ప్రవహించే పరిస్థితిని సృష్టించాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు నిండుకుండలై వరద నీటిని విడుదల చేస్తున్నాయి. మంగళవారం అధికారులు వివిధ జలాశయాల పరిస్థితిని వివరించారు.

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరగడంతో ఉదయం 6 గంటలకు 3.22 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే తూర్పు, పశ్చిమ కాలువలకు 3,837 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరగడంతో 10 రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తివేయగా, 3.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 3.70 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం 881.70 అడుగుల వద్ద ఉండగా, పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు.

కర్నూలు సుంకేశుల డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరడంతో 20 గేట్లు ఎత్తివేసి 1.36 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద కూడా వరద ఉధృతి పెరుగుతూ స్పిల్‌వే ద్వారా 7.92 లక్షల క్యూసెక్కులను కిందికి విడిచారు.

గోదావరిలోనూ వరద ప్రవాహం పెరుగుతోంది. రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.5 అడుగులకు చేరింది. 175 గేట్లు ఎత్తివేసి 8.23 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడిచారు. దీంతో పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు.

మంత్రాలయంలో తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తూ ఆలయ ప్రాంగణం వరకు నీరు చేరింది. దీనితో భక్తులను అప్రమత్తం చేస్తూ శ్రీరాఘవేంద్ర మఠం అధికారులు నదిలోకి దిగవద్దని హెచ్చరించారు.

అల్లూరి జిల్లాలో శబరి, గోదావరి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కూనవరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుండగా, చింతూరు, వీఆర్ పురం ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన చేసింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మధ్యాహ్నం లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం 3.25 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా, ఇది 5 లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించింది.

Read More : సుప్రీంకోర్టులో బెయిల్ రద్దుపై వాదనలు