అంబటి రాయుడు వ్యాఖ్యలు: నెటిజన్ల ఆగ్రహం

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రతిగా భారత సైనిక దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్ 2.0’పై మాజీ క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. “కంటికి కన్ను అనుకుంటే యావత్ ప్రపంచం గుడ్డిదైపోతుంది” అంటూ ట్వీట్ చేసిన రాయుడు, నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై పలువురు నెటిజన్లు రాయుడిని ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ప్రతిఘటన అవసరమని, లేకపోతే వారు మరింత రెచ్చిపోతారని పేర్కొంటున్నారు. కొందరు రాయుడిని పాకిస్థాన్ సానుభూతిపరుడిగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ ట్వీట్‌కు వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతతో రాయుడు కొంత వెనక్కి తగ్గారు. మొదటి ట్వీట్‌ను తొలగించకుండా, ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు మరొక రెండు ట్వీట్లు చేశారు. మొదటి ట్వీట్‌లో, “జమ్మూకశ్మీర్, పంజాబ్ మరియు భారతదేశంలోని ఇతర సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రతల కోసం ప్రార్థిస్తున్నాను. దాడులతో ప్రభావితులైన ప్రతీ ఒక్కరికీ శక్తి, భద్రత, త్వరిత పరిష్కారం కలగాలని ఆశిస్తున్నాను. జై హింద్!” అని రాసారు.

తర్వాత, “ఇలాంటి క్షణాల్లో మనం భయంతో కాదు, దృఢ సంకల్పంతో ఐక్యంగా నిలబడతాం. మన భారత సైన్యానికి ధైర్యం, క్రమశిక్షణ, నిస్వార్థతతో త్యాగాలు చేసినందుకు కృతజ్ఞతలు. వారి ధైర్యం, త్యాగాలు మాతో ఉంటాయి. జై హింద్!” అంటూ భారత సైన్యాన్ని ప్రశంసించారు.

అయితే, ఈ దిద్దుబాటు వ్యాఖ్యలు కూడా నెటిజన్ల ఆగ్రహాన్ని పూర్తిగా తగ్గించలేకపోయాయి. ఆయన మొదట చేసిన “కంటికి కన్ను” ట్వీట్‌ను పట్టుకుని విమర్శలు కొనసాగిస్తున్నాయి.

One thought on “అంబటి రాయుడు వ్యాఖ్యలు: నెటిజన్ల ఆగ్రహం

Comments are closed.