ఐపీఎల్ 2025 : బీసీసీఐ కీలక నిర్ణయం

భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025ని నిర్వహించడం సరికాదని నిర్ణయించింది. ఐపీఎల్ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం జరిగిన బీసీసీఐ సమావేశంలో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇంకా 12 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. లఖ్‌నవూ, హైదరాబాద్, అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయి, జైపుర్ నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.

గురువారం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ భద్రతా కారణాల వలన అర్ధాంతరంగా ఆగిపోయింది. టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.

అంతకుముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, ‘‘పరిస్థితిని బట్టి టోర్నమెంట్ భవిష్యత్తుపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటాం. అన్నింటికన్నా ఆటగాళ్ల భద్రత ముఖ్యం’’ అని పేర్కొన్నారు.

Read More : అంబటి రాయుడు వ్యాఖ్యలు: నెటిజన్ల ఆగ్రహం

One thought on “ఐపీఎల్ 2025 : బీసీసీఐ కీలక నిర్ణయం

Comments are closed.