ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, “పుష్ప 2” విజయంతో తన మాస్ ఇమేజ్‌ను మరింత పెంచుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బన్నీ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైథలాజికల్ జానర్‌లో నిర్మించనున్నారని, ఇది సోషియో ఫాంటసీ కాకుండా పూర్తిగా పురాణాల ఆధారంగా రూపొందనుందని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిపారు.
ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం, అల్లు అర్జున్ ఈ సినిమాలో కుమారస్వామి పాత్రను పోషించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఫ్యాన్ ఆర్ట్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్‌లో “జులాయి,” “సన్నాఫ్ సత్యమూర్తి,” “అల వైకుంఠపురములో” వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి.
ఇప్పుడు మైథలాజికల్ జానర్‌లో పూర్తి పౌరాణిక కథతో, మల్టీ-లెవెల్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను విభిన్న అనుభవం పొందించేలా సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ తనదైన భావోద్వేగాలు, డైలాగ్ డెలివరీతో కథను కొత్త రీతిలో చూపించనున్నారు.
మైథలాజికల్ చిత్రాల ట్రెండ్‌ను గమనిస్తే, “బ్రహ్మాస్త్ర,” “కాంతారా,” “ఆదిపురుష్” వంటి సినిమాలు బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయి. త్రివిక్రమ్ కూడా తన శైలిలో పౌరాణిక కథతో సీరియస్ కథనాన్ని తీసుకురావాలనే సంకల్పంలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో సౌండ్ డిజైన్, గ్రాఫిక్స్, డైలాగ్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఉన్న అంచనాలను త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి అందిపుచ్చుకుని, ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయవచ్చని భావిస్తున్నారు.

One thought on “అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మైథలాజికల్ మాస్ గేమ్!”
Comments are closed.