జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్కూల్‌కు వెళ్తున్న పదో తరగతి విద్యార్థిని హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకోడానికి కారణమైంది.
రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి (14) తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం టిఫిన్ బాక్స్ చేతిలో పట్టుకుని ఇంటి నుంచి బయల్దేరింది. కాలినడకన పాఠశాలకు వెళ్తుండగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ ఘటనను గమనించిన పాఠశాల యాజమాన్యం వెంటనే స్పందించి విద్యార్థినిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందిస్తూ సీపీఆర్ చేసి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో, మరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు సీపీఆర్ చేస్తూ చికిత్స అందించారు. అయితే, చివరకు ఆమె గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
