Delhi Elections: ‘ఆప్’కు మమత మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన కేజ్రీ
గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. తాజాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆప్ ముందుగానే ప్రకటించింది.
మమత మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మద్దతు తెలిపింది. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఆప్‌కు మద్దతు ప్రకటించగా, ఇప్పుడు టీఎంసీ మద్దతు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘టీఎంసీ మద్దతుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్యూ దీదీ! మీ మద్దతు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది. మీరు ఎప్పుడూ మా వెన్నంటే ఉన్నారు,’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దీనికి టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ వెంటనే స్పందిస్తూ, “మేము మీకు బాసటగా ఉంటాం” అంటూ భరోసా ఇచ్చారు.
ఒంటరియుద్ధం
గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ, ఆప్ ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగనుండగా, ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడతాయి. ఢిల్లీ అసెంబ్లీకి మొత్తం 70 స్థానాలు ఉండగా, ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
