శేషాచలం అడవుల్లో సాహసయాత్ర: విద్యార్థుల విషాదాంతంశేషాచలం అడవుల్లో సాహసయాత్ర: విద్యార్థుల విషాదాంతంఅడవుల్లో సాహసయాత్ర: విద్యార్థుల విషాదాంతం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు విహారయాత్ర కోసం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శేషాచలం అడవులకు నిన్న (శుక్రవారం) వెళ్లారు. నిన్న ఉదయం శేషాచలం వాటర్ ఫాల్స్ వద్దకు చేరుకున్న ఆ యువకులు మధ్యాహ్నం వరకూ అటవీ ప్రాంతాన్ని సందర్శిస్తూ గడిపారు. అనంతరం సరదాగా ఈతకొట్టేందుకు వాటర్ ఫాల్స్‌లోకి దిగారు.

కానీ, ఈతకు దిగిన కొద్ది సేపటికే వాటర్ ఫాల్స్ వద్ద సుడిగుండం ఏర్పడి, విద్యార్థి సాయిదత్త అందులో చిక్కుకుపోయాడు. అతడిని రక్షించేందుకు తోటి స్నేహితులు ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు సాయిదత్త ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో మిగిలిన స్నేహితులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు.

స్నేహితుడి మరణాన్ని దిగమింగుకుంటూ, మృతదేహాన్ని తీసుకుని మిగిలిన ఐదుగురు విద్యార్థులు అటవీ మార్గం గుండా బయలుదేరారు. అయితే, సూర్యాస్తమయం కావడంతో చీకటి కమ్మి, వారు దారితప్పారు. రాత్రంతా శేషాచలం అడవుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో ఎవరికి సమాచారం ఇవ్వాలో తెలియక అసహాయ స్థితిలో ఉండిపోయారు.

కాసేపటి తర్వాత ఓ విద్యార్థి ఎట్టకేలకు తాము అడవిలో తప్పిపోయిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. తమ లొకేషన్‌ను పోలీసులతో పంచుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వేకోడూరు పోలీసులు, అటవీశాఖ అధికారులు విద్యార్థుల రక్షణకు బయలుదేరారు. అర్ధరాత్రి సమయంలో విద్యార్థులున్న ప్రాంతానికి చేరుకుని వారిని సురక్షితంగా రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.