ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో విద్యార్థులతో ముఖాముఖి, అభివృద్ధి లక్ష్యాలపై ప్రసంగం

కుప్పం: యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని, కష్టపడితే విజయం సొంతమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రెండోరోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి సమావేశం నిర్వహించారు. అంతకుముందు కళాశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఐటీ రంగంలో మహిళలు రాణించడం సంతోషకరమన్నారు. విజన్ ముందుకెళ్లితే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తి అని ఆమె అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పుకున్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారని చెప్పారు.

భువనేశ్వరి మాట్లాడుతూ, “నేను చదువుకుంటున్నప్పుడు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నాను. ఆ వయసులో నాకు ఏమీ తెలీదు. నా భర్త చంద్రబాబు నాపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు. అది నా కోసం ఒక ఛాలెంజ్. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఆటపాటలతో పాటు కెరీర్ పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విజయం ఊరికే రాదు, కష్టపడకుండా వచ్చినది ఏదీ నిలబడదు. విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళ్లితే అద్భుతాలు సృష్టించవచ్చు” అని తెలిపారు.

“నా కుమారుడు లోకేశ్‌కీ ఇదే చెప్పేదాన్ని” అని ఆమె అన్నారు.

చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని, ప్రజలకు సేవ చేయాలని ఆయన తపిస్తారని భువనేశ్వరి అన్నారు. “ఇప్పుడు స్వర్ణాంధ్ర-విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళ్లుతున్నాం. పేదరికం లేని సమాజమే చంద్రబాబు లక్ష్యం. ఆయన్ను సొంత బిడ్డగా భావిస్తూ ప్రేమాభిమానాలు చూపిస్తున్న కుప్పం ప్రజల రుణం మేము తీర్చుకోలేం. రాబోయే ఐదేళ్లలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచి, దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నాను” అని ఆమె చెప్పారు.

అంతకుముందు శాంతిపురం మండలం శివపురం వద్ద సొంత ఇంటి నిర్మాణాన్ని భువనేశ్వరి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.