CM రేవంత్ రెడ్డి: “అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలుపుతా”
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా, కాంగ్రెస్ గెలుపొందిన అనంతరం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, అలాగే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా మారింది. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా, మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి (నవంబర్ 14) నుండి సోనియా గాంధీ పుట్టిన రోజు (డిసెంబర్ 9) వరకు ప్రజా విజయోజ్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది.
ప్రముఖ వ్యాఖ్యలు
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పేర్కొన్నారు:
“పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మబలిదానాలు, ఆకాంక్షలు, ఆశయాలు అన్నింటినీ కలిపి, వీలునామాగా రాసి… డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ నా చేతుల్లో పెట్టింది. తెలంగాణ వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించింది.
ఆక్షణం నుంచి జన సేవకుడిగా, ప్రజా సంక్షేమ శ్రామికుడిగా, మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో సకల జనహితమే పరమావధిగా, జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా, సహచరుల సహకారంతో, జనహిత ప్రోత్సాహంతో, విమర్శలను సహించి, విద్వేషాలను ఎదురిస్తూ, స్వేచ్ఛకు రెక్కలు తొడిగి, ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి… అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలిపేందుకు… గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ, నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ, నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా… విరామం ఎరుగక, విశ్రాంతి కోరక ముందుకు సాగిపోతున్నాను.
ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి, సమస్త ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
