‘కుంభకర్ణ నిద్ర’ వీడిన మోదీ ప్రభుత్వం

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇన్నాళ్లకు కేంద్రానికి జ్ఞానోదయం కలిగిందని, ‘కుంభకర్ణ నిద్ర’ వీడి మేల్కొనడం మంచి విషయమేనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న కీలక నిర్ణయాలపై ఖర్గే గురువారం తన ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్) వేదికగా స్పందించారు.

‘ఒకే దేశం, 9 పన్నులు’

గత దశాబ్ద కాలంగా జీఎస్టీని సరళీకరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉందని ఖర్గే గుర్తుచేశారు. కానీ, మోదీ ప్రభుత్వం “ఒకే దేశం, ఒకే పన్ను” నినాదాన్ని “ఒకే దేశం, 9 పన్నులు“గా మార్చేసిందని విమర్శించారు. సాధారణ జీఎస్టీ స్లాబులతో పాటు, ప్రత్యేక రేట్లను ప్రవేశపెట్టి గందరగోళం సృష్టించిందని ఆయన ఆరోపించారు. సరళమైన పన్నుల విధానంతో ‘జీఎస్టీ 2.0’ను తాము తమ ఎన్నికల మేనిఫెస్టోలలోనే ప్రతిపాదించామని ఆయన తెలిపారు.

బియ్యం, పాలపై కూడా జీఎస్టీ

ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీనే జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించారని ఖర్గే ఆరోపించారు. అయితే, ఇప్పుడు అదే ప్రభుత్వం రికార్డు స్థాయిలో పన్నులు వసూలు చేశామని సంబరాలు చేసుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. పాలు, పెరుగు, బియ్యంతో సహా వ్యవసాయ రంగానికి చెందిన 36 వస్తువులపై పన్ను విధించారని, అందుకే తాము దీనిని “గబ్బర్ సింగ్ ట్యాక్స్” అని పిలుస్తున్నామని ఆయన అన్నారు. వసూలవుతున్న జీఎస్టీలో 64 శాతం పేద, మధ్యతరగతి ప్రజల నుంచే వస్తుందని, కేవలం 3 శాతం మాత్రమే సంపన్నుల నుంచి వస్తుందని ఆయన ఆరోపించారు.

ఖర్గే డిమాండ్స్

తాజా సంస్కరణల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోయే అవకాశం ఉన్నందున, 2024-25ను ఆధార సంవత్సరంగా తీసుకుని ఐదేళ్లపాటు పూర్తి పరిహారం చెల్లించాలని ఖర్గే డిమాండ్ చేశారు. అలాగే, ఎంఎస్ఎంఈ (చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు నిజమైన ప్రయోజనం చేకూరాలంటే సంక్లిష్టమైన జీఎస్టీ నిబంధనలను తొలగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Read More : ₹500 పందెం కోసం యమునా నదిలో దూకిన యువకుడు గల్లంతు.