ప్రతి ఏడాది టీచర్ పోస్టుల కోసం డీఎస్సీ నిర్వహణ: మంత్రి

nara lokesh

ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ప్రతి సంవత్సరం టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రభుత్వ విద్యా ప్రమాణాలను మెరుగుపర్చే లక్ష్యంతో గత 14 నెలలుగా పలు కీలక సంస్కరణలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సంస్కరణల ఫలితాలను సాధించే బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులదేనని స్పష్టం చేశారు.

శుక్రవారం ఏపీ సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి లోకేష్, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను దాతల సహకారంతో కల్పిస్తున్నామని, అమరావతిలో ఏడాదిలోపుగా సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

ఏపీ చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ విజయవంతంగా నిర్వహించామన్న మంత్రి, “అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల సమయాన్ని వృథా చేయొద్దు. సంస్కరణల అసలు లక్ష్యం విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుపడటం కావాలి” అని పేర్కొన్నారు.

అసర్ నివేదిక ప్రకారం ఎఫ్ఎల్ఎన్ (Foundational Literacy and Numeracy) అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయిలో 14వ స్థానంలో ఉందని గుర్తుచేస్తూ, త్వరలోనే మెరుగైన ర్యాంక్ సాధించేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపడతామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రతి బిడ్డకు గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్‌ను హక్కుగా అందిస్తామని, మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులందరికీ ఉపాధ్యాయుల సహకారంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని అన్నారు.

అలాగే, ‘తల్లికి వందనం’ కార్యక్రమం చివరి దశ నిధులుగా రూ.325 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. పెండింగ్ దరఖాస్తులను కూడా ఆమోదించి ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశామని గుర్తుచేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా 2024-25 విద్యాసంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు భూమి సేకరణలో దాతల సహకారం తీసుకోవాలని సూచించారు.

అంతేకాక, నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేష్, నైపుణ్యం పోర్టల్ డెమోను పరిశీలించారు. దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం 50 వేల మందికి శిక్షణ లభించేలా ప్రణాళిక సిద్ధం చేశామని, పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌తో నైపుణ్యం పోర్టల్‌ను అనుసంధానం చేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు.

Read More : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం