దేశ రాజధాని సమీపంలోని నోయిడాలో ఒక డేకేర్ సెంటర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. కేవలం 15 నెలల చిన్నారి పట్ల అక్కడి సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నోయిడాలోని సెక్టార్ 137లోని పరాస్ టిరియా అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న ‘బ్లిప్పి ప్రీ-స్కూల్ అండ్ డేకేర్ సెంటర్’లో ఈ దారుణం జరిగింది.
సీసీటీవీ ఫుటేజ్‌లో దారుణాలు
ఆగస్టు 4న చిన్నారి తండ్రి ఉదయం 10.30 గంటలకు తమ బిడ్డను డేకేర్‌లో వదిలి వెళ్లగా, మధ్యాహ్నానికి తల్లి తీసుకెళ్లడానికి వచ్చింది. చిన్నారి ఏడుస్తూ ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ దృశ్యాలు చూసి షాక్‌కు గురయ్యారు. డేకేర్ సిబ్బంది చిన్నారిని దారుణంగా కొట్టడం, నేల మీద పడేయడం, నోటిలో పెన్సిల్ తోయడం, తొడలపై కొరకడం వంటి అమానుషాలకు పాల్పడినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది.
ఈ దారుణ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు డేకేర్ యజమానితో పాటు కేర్‌టేకర్‌పై చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు కారణమైంది.
Read More : పార్లమెంట్ నుండి ఈసీ వరకు విపక్ష ఎంపీల ర్యాలీ
