శివ రీ-రిలీజ్: నాగార్జున కల్ట్ క్లాసిక్ మళ్లీ థియేటర్లలో

అక్కినేని నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘శివ’ మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో విడుదలై తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాను, ఇప్పుడు ఆధునిక సాంకేతిక హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 4K విజువల్స్, డాల్బీ అట్మోస్ సౌండ్‌తో ఈ రీ-రిలీజ్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. రీ-రిలీజ్‌పై హీరో నాగార్జున ఆనందం వ్యక్తం చేస్తూ— “నాకు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చిన చిత్రం ‘శివ’. నా పాత్రను ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిపింది. 36 ఏళ్లు గడిచినా ఈ సినిమాపై చర్చ కొనసాగుతుండటం, దాని ప్రభావాన్ని నిరూపిస్తుంది. అందుకే నా సోదరుడు వెంకట్ అక్కినేని, నేను కలిసి ఈ సినిమాను మళ్లీ అంగరంగ వైభవంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. అప్పటి ప్రేక్షకులతో పాటు, యూట్యూబ్‌లో మాత్రమే చూసిన కొత్త తరానికి కూడా ఈ అనుభూతి చేరుకోవాలని కోరుకుంటున్నాం” అన్నారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ— “నాపై నాగార్జున, నిర్మాతలు ఉంచిన నమ్మకమే ఈ విజయానికి కారణం. ‘శివ’లోని ప్రతి సన్నివేశం, పాత్ర నేటికీ గుర్తుండటం నాకు ఆనందంగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడం ఉత్సాహాన్నిస్తోంది. ఆధునాతన AI టెక్నాలజీతో ఒరిజినల్ మోనో సౌండ్‌ను డాల్బీ అట్మోస్‌గా మార్చాం. ఈ కొత్త సౌండ్ అనుభవం ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా ఉంటుంది” అన్నారు.

ఆగస్టు 14న సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్ర ప్రదర్శనతో పాటు ‘శివ’ రీ-రిలీజ్ టీజర్‌ను థియేటర్లలో చూపించనున్నారు. నాగార్జున, అమల, రఘువరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, ఉత్తమ సంభాషణల రచయిత విభాగాల్లో మూడు నంది అవార్డులను గెలుచుకుంది.

Read More : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం: అల్లూరి జిల్లాకు సీఎం