కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓటర్ల జాబితా అక్రమాల ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా స్పందించింది. రాహుల్ ఆరోపణలను “అసత్యం, ఆధారంలేని మాటలు”గా అభివర్ణించిన ఈసీ, ఆయన తన మాటలకు కట్టుబడి ఉంటే ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, లేకపోతే దేశానికి క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరింది. గురువారం జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ, 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రజెంటేషన్ ద్వారా, ఒకే ఓటరు పేరు పలుమార్లు నమోదు కావడం, ఇతర రాష్ట్రాల జాబితాలోనూ కనిపించడం, ఉనికిలో లేని చిరునామాలు, ఒకే ఇంటి నంబరుతో వందలాది ఓట్లు, ఫోటోలు సరిపోని గుర్తింపు కార్డులు, కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫారం-6 దుర్వినియోగం వంటి ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.
అలాగే, బీజేపీకి అనుకూలంగా ఎన్నికల షెడ్యూల్ రూపొందించిందని, డిజిటల్ ఓటర్ల జాబితాను ఇవ్వడానికి ఈసీ నిరాకరించిందని ఆరోపించారు.
ఈ ఆరోపణలను ఈసీ ఘాటుగా ఖండించింది. “రాహుల్ గాంధీ తన విశ్లేషణను నిజమని నమ్మితే ప్రమాణ పత్రంపై సంతకం చేయాలి. చేయకపోతే, ఆయన ఆరోపణలు అబద్ధమని తేలుతుంది. ఆ పక్షంలో దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే” అని ఈసీ స్పష్టం చేసింది. బీజేపీ కూడా ప్రతిస్పందిస్తూ, రాహుల్ గాంధీ ఆధారాలు సమర్పించలేదని విమర్శించింది. “ఆయన జాబితాను ఎందుకు ఇవ్వడం లేదు? ఆధారాలు లేకపోతే ఇది రాజకీయ నాటకం మాత్రమే. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి, నిష్పక్షపాత సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యం” అని బీజేపీ మీడియా సెల్ చీఫ్ అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు.
Read More : ఓట్ల దొంగలకు శిక్ష తప్పదు: రాహుల్ గాంధీ
