సుప్రీంకోర్టు ఆదేశాలపై కడియం శ్రీహరి స్పందన

పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఉప ఎన్నికలను నిర్ణయించేది కేటీఆర్ కాదని, ఎన్నికల సంఘమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్‌కు గానీ, కేటీఆర్‌కు గానీ లేదని విమర్శించారు.

పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిందీ బీఆర్ఎసేనని ఆరోపించిన కడియం శ్రీహరి, గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఇతర పార్టీలను విలీనం చేసుకున్నదీ, ఎమ్మెల్యేలను చేర్చుకున్నదీ వాస్తవమని తెలిపారు. ఉప ఎన్నికలు జరిగితే తాను తిరిగి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయం కోసం తాము వేచి చూస్తున్నామని ఆయన వెల్లడించారు.

One thought on “సుప్రీంకోర్టు ఆదేశాలపై కడియం శ్రీహరి స్పందన

Comments are closed.