సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో ఓ వివాహిత తన ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టి, అనంతరం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది.
పోలీసుల సమాచారం ప్రకారం, నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన మహిళ ఎనిమిదేళ్ల క్రితం రామచంద్రాపురానికి చెందిన వ్యక్తితో వివాహం చేసుకుంది. అయితే, మనస్పర్థల కారణంగా వివాహం జరిగిన ఏడాదికే భర్తతో విడిపోయి వేరుగా జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఏడేళ్ల క్రితం కొమరబండకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అతడితో సహజీవనం చేస్తోంది. ఇటీవల అతడిని వివాహం చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయగా, యువకుడు నిరాకరించాడు. దీంతో గత రెండు రోజులుగా ఆమె అతడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆపే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, సీఐ రజితారెడ్డి తక్షణమే స్పందించి ఆమెను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నానని, తనకు న్యాయం చేయాలని మహిళ పోలీసులకు మొరపెట్టుకుంది. శాంతిభద్రతలకు భంగం కలిగించిన కారణంగా ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనలో పాల్గొన్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

One thought on “కోదాడలో వివాహిత హంగామా – ప్రేమా?”
Comments are closed.