డ్రగ్స్ పై తీవ్ర దుమారం రేపిన కంగనా రనౌత్ వ్యాఖ్యలు..!

ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వ్యక్తి కంగనా రనౌత్. ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆమె చేసిన విమర్శలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగింది. ఒకరకంగా ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి అని చెప్పొచ్చు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకెళ్తే…

హిమాచల్ ప్రదేశ్ లో పెరుగుతోన్న డ్రగ్స్ మహమ్మారిని వెంటనే అరికట్టకపోతే హిమాచల్ రాష్ట్రం మరో ‘ఉడ్తాపంజాబ్ అవుతుందని ప్రభుత్వానికి గవర్నర్ శివ ప్రసాద్ శుక్లా బహిరంగ హెచ్చరిక చేశారు. 2012 నుంచి 2023 వరకు మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో 340 శాతం పెరుగుదల కనిపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా,ఈ వ్యాఖ్యలను మండీ ఎంపీ కంగనా రనౌత్ సమర్థించారు. ఇవాళ (శుక్రవారం) పార్లమెంట్ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… పాకిస్థాన్ నుంచి పంజాబ్ మీదుగా డ్రగ్స్ హిమాచల్ ప్రదేశ్ కు వస్తున్నాయి. వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోకపోతే… యువత, కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. రాష్ట్ర ప్రజలు వ్యసనాలకు బానిసలవుతూ నేరాల బాటపడుతున్నారు. ఇంట్లో బంగారాన్ని అమ్మేస్తున్నారు. కార్లు దొంగతనం చేస్తున్నారు. ఇది తల్లిదండ్రులను ఎంతగానో బాధిస్తోందన్నారు.

ఈ వ్యాఖ్యలను పంజాబ్ ఆర్థికమంత్రి హర్పాల్ సింగ్ చీమా తీవ్రంగా ఖండించారు. పంజాబ్ ను నిందించే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సర్వే నిర్వహించాలని కంగనాకు సవాల్ విసిరారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లో కూడా పంజాబ్ లో కంటే అధికంగా డ్రగ్స్ బెడద ఉందన్నారు. ఇకపోతే.. పంజాబ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం కథాంశంగా 2016లో ఉడ్తాపంజాబ్ సినిమా వచ్చింది. ఈ సినిమా విడుదలపై పంజాబ్ లో తీవ్ర నిరసన వ్యక్తమైంది కూడా. డ్రగ్స్ ను ఎలా నివారించాలి అనేదాని కన్నా ఒకరినొకరు నిందించుకోవడానికే ప్రాధ్యాన్యత ఇస్తున్నారని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. పంజాబ్ ఆర్ధిక మంత్రి సవాల్ ను కంగనా స్వీకరిస్తుందా? చూడాలి మరి!

Read More : విమానాశ్రయంలో వరద నీరు, రహదారులు జలమయం