ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు

తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్, తెలంగాణ యాసలో మాటలతో ఆకట్టుకున్న ప్రముఖ హాస్యనటుడు ఫిష్ వెంకట్ (అసలు పేరు వెంకట్ రాజ్) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వెంకట్, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జులై 18 వ తేదీన తుదిశ్వాస విడిచారు. గత తొమ్మిది నెలలుగా రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఇటీవల విషమించింది. వెంటిలేటర్‌పై ఉంచినప్పటికీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.

ఫిష్ వెంకట్ 2001లో ‘ఖుషి’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆది, బన్నీ, గబ్బర్ సింగ్, అదుర్స్, డీజే టిల్లు తదితర పలు హిట్ చిత్రాల్లో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కామెడీతో పాటు చిన్న విలన్ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇటీవల నటించిన ‘స్లమ్ డాగ్ హస్బెండ్’, ‘నరకాసుర’, ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ వంటి చిత్రాలు ప్రేక్షకులలో ఆదరణ పొందాయి. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో కిడ్నీ మార్పిడి అవసరమై, సుమారు రూ.50 లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు వెల్లడించగా, ఆయన కుమార్తె స్రవంతి ప్రజల సహాయానికి విజ్ఞప్తి చేశారు. కొంతమంది సహాయం చేసినప్పటికీ, సరైన దాత దొరకకపోవడం ప్రధాన సవాలిగా మారింది.

ఫిష్ వెంకట్‌ హైదరాబాద్‌లో తన భార్య సువర్ణ, కుమార్తె స్రవంతితో కలిసి నివసిస్తున్నారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తూ, సోషల్ మీడియా వేదికలపై ఆయనను గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read More : ప్రియాంక చోప్రా పుట్టినరోజు వేడుక

One thought on “ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు

Comments are closed.