ఏపీ హైడ్రోజన్ వ్యాలీగా మారనుంది: సీఎం

ఆంధ్రప్రదేశ్‌ను హైడ్రోజన్ వ్యాలీగా రూపుదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో రాష్ట్రం ముందుండాలని, ఇందుకోసం అవసరమైన సాంకేతికతను తీసుకురావాలని పరిశ్రమలకు ఆయన సూచించారు. శుక్రవారం అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “మీ ఆలోచనలు, ఆవిష్కరణలు తెలుసుకోవడానికి వచ్చాను. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్‌కు ప్రాధాన్యం పెరిగింది. మీరు రెండు రోజులపాటు ఇక్కడే ఉంటారని తెలిసి ఆనందంగా ఉంది” అని అన్నారు.

ఈ సదస్సులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, సీఎస్ విజయానంద్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా పలువురు కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

విద్యుత్ రంగ సంస్కరణలపై మాట్లాడుతూ… “దేశంలో విద్యుత్ సంస్కరణలు మొదటిసారిగా నేను తీసుకొచ్చాను. వాటి అమలుతో అప్పట్లో అధికారం కోల్పోయాను. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాం. విద్యుత్ సంస్థలు ఈ రంగంలో పరిశోధనలు చేయాలి. ఏపీకి ఇలాంటి ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది. ప్రధాని మోదీ గారు 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని నిర్ణయించారు. నీతి ఆయోగ్ కూడా ఈ దిశగా పనిచేస్తోంది” అని సీఎం వివరించారు.

“మీ అందరికీ ఉత్తమ వేదిక ఏపీలో ఉంది. కాబట్టి మీరందరూ ముందుకు రావాలి” అంటూ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Read More : టీడీపీకి అశోక్ గజపతిరాజు రాజీనామా

One thought on “ఏపీ హైడ్రోజన్ వ్యాలీగా మారనుంది: సీఎం

Comments are closed.